అబిడ్స్, జియాగూడ, ఏప్రిల్ 6: ఆదర్శమూర్తుడు శ్రీరామ చంద్రుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం దూల్పేట్లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రతిఒక్కరూ హితభాషి, మితభాషి, పూర్వభాషి”గా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ తెలివిగా మాట్లాడాలని, ఇతరుల బాధను అర్థం చేసుకున్న తర్వాత తక్కువగా మాట్లాడాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి వేడుకలను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారని తెలిపారు. దూల్ పేటలో సీతారాముల పల్లకి ఊరేగింపులో పాల్గొనేందుకు అవకాశం తనకు లభించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఆమె శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారులకు ఆమె చాక్లెట్లను పంపిణీ చేశారు. రామ లక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్ జీ కి అంటూ ఆమె పాటలు పాడి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ సింగ్, పప్పు మాత్రే, ఆశిష్ కుమార్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ సీహెచ్ఆ.నంద్ కుమార్ గౌడ్, ఎం.ఆనంద్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోశ్ గుప్త దంపతులు, ప్రియా గుప్తా, శ్రీనివాస్ గౌడ్, ప్రదీప్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన నాయకులు..
దూల్పేట్లో సీతారాముల పల్లకి ఊరేగింపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నాయకులు ఘన స్వాగతం పలికారు. గోషామహల్ నియోజకవర్గం లో ఆనంద్ సింగ్ నిర్వహిస్తున్న ఈ పల్లకి ఊరేగింపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత విచ్చేయగా నాయకులు ఆమెకు అడుగడుగునా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి కిరీటంతో సన్మానించారు.