బంజారాహిల్స్, ఏప్రిల్ 13: అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. అందుకే గతంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణను రోజురోజుకూ అన్ని రంగాల్లో దిగజారుస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 17న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవసభ సన్నాహక సమావేశాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో విజయం సాధించడంతో పాటు పదేళ్ల పాలనలో దేశంలోనే అగ్ర స్థానంలో రాష్ట్రాన్ని నిలిపిన ఘనత ఉద్యమసారథి కేసీఆర్‌దే అని కొనియాడారు. వడ్డించిన విస్తరిలా ఉన్న రాష్ట్రాన్ని అబద్ధాలు, అపోహలతో కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. జీడీపీలో, తలసరి ఆదాయంలో ముందున్న తెలంగాణ ప్రస్తుతం గణనీయంగా పడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ చేతగానితనమే అని అరోపించారు. మంత్రుల మద్యన సమన్వయం లేదని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి అధికారం కోసం ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలకు బుద్ధి వచ్చేలా చేసేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా ఉన్నారని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా గులాబీ జెండాను వదిలిపెట్టకుండా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని నమ్మి తామంతా పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేసి ఏప్రిల్ 27న వరంగల్ సభకు భారీ ఎత్తున తరలిరావాలని సూచించారు. డివిజన్ వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు.