Hyderabad MLAs | హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై నగర పరిధిలోని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ అభివృద్ది కుంటుపడిందని.. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. నగరంలో రోడ్లను పట్టించుకునే నాథుడే కరవయ్యాడని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్‌గా ఉండేదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని గుర్తుచేశారు. హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంటుందని తలసాని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ తిరిగొస్తేనే హాయిగా ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రగతి సాధించిందని చెప్పారు.
కేటీఆర్ నాయకత్వంలో సిటీ రోడ్లు బ్రహ్మాండంగా తయారయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ రోడ్లకు దుర్దశ వచ్చిందని మండిపడ్డారు. గంటల తరబడి రోడ్లపై నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రూ.70 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి జరిగిందని తలసాని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక రెండేళ్లలో హైదరాబాద్ నగరం అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు. నగరంలో ఎస్టీపీలు కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల టెండర్లు రద్దు చేసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎయిర్‌పోర్టు రోడ్డు నుంచి శ్రీశైలం హైవే వరకు టెండర్లు పిలిచి ఈ సర్కార్ తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. టెండర్లు వచ్చిన వాటికి కూడా పనులు జరగడం లేదని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు ఫొటోలకు పోజులిచ్చి వెళ్లిపోయారని అన్నారు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేశామని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి ఆరంభ శూరత్వమని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో గత పదేండ్లు హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు గొప్ప విజయం అందించారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అండర్ పాస్‌ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రగతి కుంటుపడిందని కేపీ వివేకానంద అన్నారు. సర్కార్ చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. చిన్న చిన్న లింకు రోడ్ల నిర్మాణంలోనూ నిర్లక్ష్యమే ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఫ్లై ఓవర్లను కూడా పూర్తి చేయడం లేదని తెలిపారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో కొత్త రోడ్లు వేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నాగోల్ నుంచి గండిపేట వరకు ఈస్ట్ వెస్ట్‌ను లింక్ చేయాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని సూచించారు. అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.
ముషీరాబాద్‌లో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. పద్మారావునగర్, గంగపుత్ర కాలనీ, పార్సిగుట్టలో రోడ్లు పాలయ్యాయని తెలిపారు. చిక్కడపల్లిలో రోడ్ల విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సుందరయ్య పార్క్ చుట్టుపక్కల రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చిందని ముఠా గోపాల్ తెలిపారు. ఇతర ప్రాంతాల వాళ్లు కూడా ఇక్కడ స్థిరపడ్డారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నారని చెప్పారు. హైదరాబాద్ సిటీ అద్భుతమని రజినీకాంత్ కొనియాడారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రోడ్లను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.