సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరంగా వెలుగొందిన హైదరాబాద్ ప్రతిష్టను కాంగ్రెస్ పాలకులు దిగజారుస్తున్నరు. రెండున్నరేండ్లలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయకుండా నగర ప్రగతిని పాతాళానికి నెట్టేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్.. ప్రపంచమే నివ్వెరపోయేలా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ పాలకులు రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాద్ కీర్తిని దిగజారుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగర అభివృద్ధికి కేవలం రూ. 122 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కనీసం బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నగర పరిస్థితిని దిగజారుస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, నివాసయోగ్యమైన భాగ్యనగర ఖ్యాతిని అభాసుపాలు చేస్తున్నరు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు, ప్రముఖులు నగరం విడిచి వెళ్లేలా చేస్తున్నారు’..అంటూ నగర అభివృద్ధిని గాలికొదిలేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి రెండున్నరేండ్ల పాలనలో కుంటుపడిన హైదరాబాద్ అభివృద్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ముఠాగోపాల్, సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా భాగ్యనగరానికి చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. గుంతలరోడ్లు, ట్రాఫిక్ సమస్యలు, అదుపు తప్పిన శాంతిభద్రతలు, పేట్రేగిపోతున్న కాలుష్యాలను ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలతో భాగ్యనగరం పరిస్థితి దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో గళమెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. హెచ్సిటీ ప్రాజెక్టులో రెండేండ్లకు రూ. 2,600 కోట్లుకు పైగా నిధులు కేటాయించారు. కానీ అందులో ఒక్క శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా నగరాన్ని గాలికొదిలేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కంటే వందరెట్లు ఎక్కువగా చేసి చూపిస్తామని అనేకసార్లు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలుగా మిగిలాయి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పుకుని ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకాన్ని ప్రారంభించకపోగా, బీఆర్ఎస్ చేపట్టి తుది దశలో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పనులన్నీ పూర్తయి కేవలం ప్రారంభాలకు సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, బ్రిడ్జిలను సైతం అందుబాటులోకి తీసుకురాకుండా హైదరాబాద్ నగరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గుండెకాయవంటి హైదరాబాద్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. హైడ్రా పేరిట రియల్ రంగాన్ని పాతాళానికి పడేసి.. పెట్టుబడులు రాకుండా చేయడమే కాకుండా కనీస వసతులు కల్పించకపోవడంతో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. జీహెచ్ఎంసీని సైతం ఇష్టారీతిని మూడు ముక్కలు చేసి విలీన గ్రామాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీంతో అసెంబ్లీలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు తిరోగమనం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ ఇమేజ్ను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సగం పాలన పూర్తయ్యేసరికి కేవలం రూ.122 కోట్లే ఖర్చు చేస్తే.. మరో సగం కాలంలో ఏం చేస్తారని నిలదీశారు.
ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధికి కేవలం రూ.122 కోట్లు ఖర్చు పెట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. నగరం సమస్యల వలయంలో కూరుకుపోతే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టి నగరాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిపామని స్పష్టం చేశారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లకే చతికిల పడిందని ఎద్దేవా చేశారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఎక్కడ చూసినా గుంతలమయంగా దర్శనమిస్తున్నాయని తెలిపారు.
గుంతల రోడ్లు, గతుకుల వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జ్‌లు, లింక్ రోడ్లను పూర్తి చేసినా నగరం లో సగం ట్రాఫిక్ సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగర ప్రజలకు అత్యవసరమైన ప్రాజెక్టులను పక్కన పెట్టి.. గతప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు, టెండర్లు, డీపీఆర్‌లను వదిలేసి కొత్తగా తక్షణమే అవసరం లేని ప్రాజెక్టులను బడ్జెట్లో కేటాయింపులు చేశారని ఆరోపించారు. ప్రజల ప్రస్తుత సమస్యలను పరిష్కరించకుండా భవిష్యత్ అవసరాలపై ఎందుకు ఫోకస్ చేస్తున్నారని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధి కి లండన్, జపాన్ పోటీ అని గొప్పలు చెప్పిన సీఎం మాటలు ఏమయ్యాయన్నారు.