MLA Talasani Srinivas Yadav | హైదరాబాద్ : పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, పలు నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీన పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా అన్ని డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అదేరోజు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు రేపటి నుండి నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 20వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బాడీ నిర్వహించడం జరుగుతుందని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో ఆదర్శవంతమైన పాలనతో అభివృద్ధిలో దేశానికే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.