MLA Talasani | హైదరాబాద్ : అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారు. అలాంటి వారికి కడుపునిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించాం. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉదేశ్యం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. 6 గ్యారెంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి.. మాకు అభ్యంతరం లేదు.. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్దతి కాదు.. ఆరోగ్య శ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి పేరే మేము కొనసాగించడం జరిగింది. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు. అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశ్యం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టీ, ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీజేఆర్ ఫ్లై ఓవర్ ఓపెన్ చేస్తున్నారు.. మరి అది కట్టింది ఎవరు..? తిమ్మిని బొమ్మను చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.