MLA Talasani | అమీర్‌పేట్, జూలై 3 : ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేలా నిబంధనలున్నా, రెవెన్యూ అధికారులు ఆ దిశగా బాధ్యతగా స్పందించడం లేదని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారే తప్ప, బాధిత కుటుంబాలకు తదుపరి సహాయక చర్యలు అందేలా చూడడంలో రెవెన్యూ యంత్రాంగం ఘోరంగా విఫలమైన ఉదంతాలు ఇటీవల అనేకం ఉన్నాయన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రవికిరణ్, మాధవి దంపతులు తమ ఏడేళ్ల కుమారుడు మాన్వితతో కలిసి సనత్‌నగర్ రాజరాజేశ్వరినగర్‌లోని ఓ ఇంట్లోని మూడవ అంతస్తులో అద్దెకు నివాసముంటున్నారు.
గురువారం ఉదయం 7.30 గంటలకు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి రిఫ్రిజిరేటర్ నుండి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు కూరగాయల మార్కెట్ వెళ్లడంతో ఇంట్లో మాన్విత్ ఒక్కడే ఉన్నాడు. అదేసమయంలో ఊహించిన విధంగా రిఫ్రిజిరేటర్ నుండి మంటలు వ్యాపించడంతో, ఏడేళ్ల మాన్విత్ ఏమాత్రం ఆందోళన చెందకుండా తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ఫోన్ ద్వారా సమాచారం అందించడమే కాకుండా, చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయడంతో, చుట్టుపక్కల వారు వచ్చి మంటలు మరింత వ్యాపించకుండా నీళ్లు చల్లారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లోని బట్టలు, వస్తువులతో పాటు పుస్తకాల్లో దాచుకున్న నగదు కూడా కాలిపోవడంతో రవికిరణ్ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన వంతు చేయూతగా రూ. 50 వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుళ్ల మాన్విత్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే తలసాని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగం ప్రమాద బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందించే వీలున్నా సరిగ్గా స్పందించడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబానికి వెంటనే తగిన చేయూతనందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.