MLA Sudheer Reddy | మన్సురాబాద్, మార్చి 8 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సురాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధి బాలాజీ నగర్ కాలనీలో రూ. 23 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని శనివారం స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
మహిళా భవనం కోసం నిధులు మంజూరు చేసి నిర్మింప చేసినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ ట్రంక్ లైన్, అంతర్గత యుజిడి వ్యవస్థ, రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశలవారీగా కాలనీలలో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిన ట్రంక్ లైన్ పనులు, అంతర్గత యూజడి వ్యవస్థ పనులను త్వరలో పూర్తి చేయిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, చంద్రారెడ్డి, నాగార్జున రెడ్డి, కాలనీవాసులు మోహన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్, పరశురాం, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.