MLA Sudheer Reddy | వనస్థలిపురం, జూన్ 15 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి తీసుకువచ్చిన జీవో 118ను ఆపి, సమస్యను మరింత జఠిలం చేస్తున్న దుర్మార్గుడు కాంగ్రెస్ నేత మధుయాష్కీ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలో ఉండి సమస్యను పరిష్కరించడం చేతగాక పోరాడి సాధించిన జీవో పైన అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్ల పాటు వందలాది సమావేశాలు ఏర్పాటు చేసి వందలాది అధికారులను ఒప్పించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ల సహకారంతో 118 జీవోను తీసుకురావడం జరిగిందన్నారు. 70 శాతం మందికి కన్వీనియన్స్ డీడ్లు వచ్చాయని చాలామంది లోన్లు కూడా తీసుకున్నారని తెలిపారు. కాగా అనుమతి లేకుండా నిర్మించిన ఇండ్లకు రిజిస్ట్రేషన్లు కావడంలేదని దీనికి జీవో నెంబర్ 168 అడ్డుపడుతుందని తెలిపారు. ఆ జీవోని సవరించడం కానీ రద్దు చేయడం కానీ చేస్తే సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం జరుగుతుందన్నారు. అది చేతకాక ఉన్న జీవోను ఆపి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నవాళ్లు సమస్యను పరిష్కరించినందుకు కృషి చేస్తారు కానీ ఎల్బీనగర్లో మధుయాష్కీ గౌడ్ సమస్యను మరింత జఠిలం చేసి బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న 168 జీవోను సవరించి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆ జీవో సవరణకు అన్ని ప్రతిపాదనలు చేయడం జరిగిందని దానిపై లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నామన్నారు. అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆపేశామని తిరిగి తాము అధికారంలోకి రాకపోవడం వల్ల సమస్య అలాగే ఉండిపోయిందని తెలిపారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు, వినతి పత్రాల ద్వారా ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాన్ని తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. బాధితులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని 118 జీవోతో సమస్య పరిష్కారం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఇంటికి సంపూర్ణమైన హక్కులు కలిగించేంతవరకు తాను విశ్రమించబోను అని తెలిపారు.