MLA Sabitha | బడంగ్పేట్, జులై 13 : మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ, మంకాళ, ఇమామ్గూడ తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరల్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భక్తులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా స్థానికులతో మమేకమై సంబరాల్లో పాల్గొన్న ఆమె, తెలంగాణ సాంస్కృతిక విలువలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. దేశ విదేశాలలో సైతం బోనాల జాతర జరుపుకుంటున్నారంటే అందుకు తెలంగాణ ఉద్యమమే కారణమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బోనాల జాతర తెలంగాణలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని ఆమె వేడుకున్నారు. పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారు చూడాలని ఎమ్మెల్యే అన్నారు.