కవాడిగూడ, ఏప్రిల్ 14: ప్రతి పౌరుడి నైతిక అభివృద్ధియే దేశాభివృద్ధి అని చెప్పిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ జయంతిని కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జయసింహతో కలసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ముఠా గోపాల్ మాట్లాడుతూ.. అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన రాజనీతిజ్ఞుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని అన్నారు. బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ మాట్లాడుతూ.. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలుస్తుందన్నారు. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం ఆయన పరితపించారన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.