MLA Marri Rajashekar Reddy | మల్కాజ్గిరి, మార్చి 12 : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విస్మరించిందని అన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి, అల్వాల్ సర్కిల్ ఉద్యమకారులు పాల్గొన్నారు.