Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 27 : అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ రవి కిరణ్కు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. స్మశాన వాటికల అభివృద్ధి, స్ట్రామ్ వాటర్ డ్రైన్, బాక్స్ డ్రైన్లు, రెండవ దశ సిఆర్ఎంపి రోడ్లు, సిసి రోడ్లు, పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశామన్నారు. మారుతి నగర్ నుండి ఏఎస్ రావు నగర్ వెళ్లే రోడ్డు బాక్స్ డ్రైన్ పనులు పూర్తి అయినా ఇంతవరకు రోడ్డు వేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు సీసీ రోడ్డు లేని షాదుల్లా నగర్, శాలిబస్తి, యాదవ డైరీ ఫార్మ్ రోడ్, షాదుల్లా నగర్ ఈద్గా, సాయినాథపురం, ఈశ్వర్ నగర్ బస్తీలలో అవసరమైన చోట్లలో సిసి రోడ్లు వేయాలని ఉన్నారు. హిందూ, ముస్లిం స్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని, భరణి కాలనీలోని స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించాలని, మహాలక్ష్మి పూరి కాలనీలో సిసి రోడ్లు వేయించాలని అన్నారు. యాప్రాల్ సాయి కృష్ణ నగర్ ఫేస్ టులో సిసి రోడ్డు, భూపేష్ నగర్ యాప్రాల్లో, మధుర నగర్ర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ స్థలం ఆక్రమణ కాకుండా కాపాడాలని అన్నారు. వినాయక్ నగర్ లో ముస్లిం స్మశాన వాటికను అభివృద్ధి పరచాలని, పైపులైను వేసి తొవ్వి వదిలేసిన చోట సీసీ రోడ్లు నిర్మించాలని, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్లో దొడ్ల బస్తీ , వసంతపురి కాలనీ, తిరుమల నగర్ కాలనీలలో కమ్యూనిటీ హాల్ అసంపూర్ణంగా ఉన్న హాల్ ను పూర్తి చేయాలని, గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జున నగర్ లో సీసీ రోడ్లు, వీధి దీపాల నిర్వహణ చేయాలని, మల్లికార్జున్ నగర్ రోడ్ నెంబర్ 9 లో చెత్త వేసి డంపింగ్ యార్డ్ గా తయారు చేస్తున్నారు దాన్ని తొలగించాలని అన్నారు. మోడల్ గ్రీన్ యార్డ్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఇండోర్ స్టేడియాలను నిర్మించాలని అన్నారు. అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించాలని ఉన్నారు. జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రాము యాదవ్, బిఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, ఏకే మురుగేష్, జీకే హనుమంతురావు, అమీనుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.