Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలను మధ్యాహ్నం ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. గోపీనాథ్ అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు గాల్లోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు అంతిమయాత్రలో పాడెను మోశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం వేకువ జామున 5.45 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఈ నెల 5న ఆయన ఏఐజీలో చేరారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబీకులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు, ఎమ్మెల్యే కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు గుర్తించారు. దాంతో సీపీఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకుంది. నాడీ, బీపీ సాధారణ స్థితికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగించారు. అయితే, గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో గోపీనాథ్ బాధపడుతున్నారు. ఈక్రమంలో మూడు నెలల కిందట ఆయన ఏఐజీలోనే చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు తెలిసింది. గుండెపోటు రావడంతో మూడురోజుల నుంచి చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయారు.