హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కాకుండా చూడాలని, హైదరాబాద్ నగరాభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారుకు ఒక విజన్ అంటూ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రగతి పడకేస్తున్నదని మండిపడ్డారు. గత పదేండ్లల్లో లేకుండా పోయిన కరెంటు కోతలు, నీటి ఎద్దడి పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో సోమవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్, ఇండస్ట్రీస్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్స్ తదితర శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ నగరంపైన గత 16నెలలుగా ప్రభుత్వం దృష్టి ఏరకంగా ఉందో బడ్జెట్లో కేటాయింపులు, చేసిన ఖర్చులే నిదర్శనంగా నిలుస్తాయని వివరించారు. తొలుత బీఆర్ఎస్పై రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరాభివృద్ధికి గతేడాది రూ.10వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పారని, కానీ అందులో కనీసం 25శాతం నిధులను కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరానికి రూ.7582కోట్లు డిమాండ్ చేస్తే అందులో 40శాతం మాత్రమే ఇస్తామని చెప్పిందని, ప్రభుత్వం కమిట్మెంట్ ఏమిటో తెలిసిపోతున్నదని మండిపడ్డారు. జలమండలి మీద ఇప్పటికే రూ.1500కోట్ల రుణం ఉందని, మరో 2050కోట్ల భారం మోపనున్నారని తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా ఎవరి ప్రయోజనాల కోసం మల్లన్నసాగర్ నుంచి 7కోట్ల ఖర్చుతో నీటిని సరఫరా చేయాలని చూస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుకు జలమండలి ముందు నిత్యం ఖాళీ కుండలతో ధర్నాలు చేసే పరిస్థితి ఉండేదని, మళ్లీ ఈ ఏడాది పాతరోజులను గుర్తుచేస్తున్నారని, అదేమంటే ఎండలు నెలముందే మొదలయ్యాయని పర్కారు సాకులు చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకువచ్చే సుంకిశాల పనులను గత ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయ్యాయని, కానీ కాంట్రాక్టు మేఘా కంపెనీ నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వం వల్ల అది కూలిపోయిందని, ఇప్పుడు ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారని మండిపడ్డారు. మేఘా కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎమర్జెన్సీ మోటార్ల ఖర్చును సైతం మేఘా కంపెనీతోనే పెట్టించాలని డిమాండ్ చేశారు.
హైడ్రాతోనే రియల్ఎస్టేట్ ఢమాల్..
హెచ్ఎండీఏ ఆదాయం ఏటా రూ.120-200 కోట్లు వరకు ఉండేదని, కానీ గడచిన ఏడాదిలో రూ.50కోట్ల కంటే తక్కువగా పడిపోయిందని, అది మెయింటనెన్స్‌కే సరిపోతుందని తెలిపారు. మరోవైపు హెచ్ఎండీఏ రూ.23వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టిందని, అలాంటప్పుడు వాటిని ఏ రకంగా పూర్తి చేస్తారని నిలదీశారు. భూములను అమ్ముకుని తీసుకుందామని చెబుతున్నారని, కానీ హైడ్రా పుణ్యమాని ఆ పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపారు.
గ్రేట్‌లో ఏటా 10-15శాతం కరెంటు డిమాండ్ పెరుగుతుందని, ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ సర్కారు గ్రేటర్ గ్రిడ్‌ను ప్రణాళికను రూపొందించి అమలు చేసేదని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం వేసవి కార్యాచరణ రూపొందించలేదని, అమలు చేయడం లేదని, ఫలితంగా 24 గంటలు కరెంటు ఉండడం లేదని వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో 72సబ్స్టేషన్లు పెట్టాలని గతంలోనే అధికారులు ప్రతిపాదనలు పెట్టారని, కానీ సర్కారు ఆ టెండర్లను ఆపేసి, దక్షిణ డిస్కం పరిధిలోని 200 సబ్స్టేషన్లను కలిపి ఒకేసారి పిలిచిందని, గిట్టుబాటు కాలేదని వచ్చిన ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు.
ఈ లోగా ఎండాకాలం వచ్చిందని, ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడర్లో కరెంటు పోతుందని తెలిపారు. ఎలివేటెడ్ కారిడర్‌కు శంకుస్థాపనలు చేశారు తప్ప ఇప్పటికీ సర్వేలే కొనసాగుతున్నాయని, నగరంలో 40 శాతం వీధిలైట్లు వెలగడం లేదని, సీసీ కెమెరాల మెయింటనెన్స్ లేకుండా పోయి నిర్వీర్యం అవుతున్నాయని నిలదీశారు. రెసిడెన్షియల్ నివాసాలకు సైతం కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, పెనాల్టీలు విధిస్తున్నారని నిప్పులు చెరిగారు. కుక్కల నియంత్రణ చేపట్టాలని తెలిపారు.
నగరంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో మళ్లీ కాలుష్యం పెరిగిపోయిందని, బాచుపల్లి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్నారని, ఎందుకు కాలుష్యం నియంత్రణ లేకుండా పోయిందని, ఇది ప్రభుత్వం వైఫల్యమా? చేతగాని తనమా? అని వివేకానంద్ నిలదీశారు. వార్‌రూమ్‌లను ఏర్పాటు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను పూర్తి చేయాలని వెల్లడించారు.
జీఐఎస్ సర్వే చేశారని, కానీ ఎందుకు చేశారు? అది ఎక్కడికి వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీకి కట్టుబడి ఉండాలని, రూపాయి ఖర్చు లేకుండా ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.కొంపల్లిలో నేచురల్ వ్యాలీకి హెచ్ఎండీఏ ఎన్వోసీ ఇవ్వాలని, అది అత్యంత అసరమని వివరించారు.
దివాళా తీస్తే పెట్టుబడులు ఎలా వచ్చాయి..?
హైడ్రాతో ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారని, బిల్డర్ వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్యను ఈ సందర్భంగా ఉదహరించారు. కార్నింగ్, తదితర కంపెనీలు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ర్టానికి పోవడానికి కారణాలు ఏమిటీ? ఫార్మా సిటీ రద్దు వల్లనా? ఎందుకని నిలదీశారు. ఒకవైపు ప్రభుత్వం 2లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేస్తున్నదని, మరోవైపు రాష్ట్రం దివాళా తీసిందని, ఎవరు నమ్ముతలేరు? అప్పు పుడుతలేదు? అని ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని, అందులో ఏది నిజమని నిలదీశారు.
ఈ ఏడాది ఐటీ ఎగుమతులు, కల్పించిన కొత్త ఉద్యోగాలు గతంలో పోల్చితే భారీగా తగ్గాయని, ఎందుకు తగ్గాయని కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను రైజ్ చేయడం సంగతి అటుంచి, పడుకోబెట్టకుండా చూడాలని విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్‌పైనే దృష్టి పెట్టకుండా, హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.