బంజారాహిల్స్, సెప్టెంబర్ 10 ;సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బీఆర్ఎస్ తరఫున మరోసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లభించింది. రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మార్చడంతో పాటు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకం తదితర అంశాలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా పలు అంశాలను వివరించిన ఎమ్మెల్యే దానం.. ఖైరతాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురనున్నదని చెప్పారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఇచ్చిన మాట ప్రకారం…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సుమారు 20 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమం తీవ్రతను గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనివార్యంగా అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లోకి వచ్చాను. పార్టీలో చేరుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే అంటూ.. సీఎం చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మరువను. రాజకీయ భవిష్యత్‌పై నాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాతో పార్టీలో చేరిన నాకు 2018 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో ఘన విజయం సాధించాను. నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను ప్రజలకు అందిస్తుండటంతో రెండోసారి కూడా టికెట్ ఇస్తానని చాలా కాలం కిందటే సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే మరోసారి ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు. సీఎం కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తాను.
సుమారు 30వేల కుటుంబాలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఖైరతాబాద్ నియోజకవర్గంలో వేలాదిమంది ప్రయోజనం పొందుతున్నారు. ఆసరా పింఛన్ల ద్వారా నియోజకవర్గంలో సుమారు 18వేలమంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరుతున్నది. వీరితో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల ద్వారా మరో 12వేల మంది ఇప్పటివరకు లబ్ధి పొందారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న 30వేల కుటుంబాలు ఉన్నాయి. వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిరంతరం ఆశీర్వదిస్తున్నారు. గతంలో పేదరికంతో సరైన విద్యను నోచుకోని మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ వర్గాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చదువుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో పేదలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో మైనార్టీలు, ఎస్సీలు గణనీయంగా ఉన్నారు. వారిలో 90 శాతం మంది పేదలే. ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా.. గతంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. బస్తీదవాఖానల ఏర్పాటు తర్వాత వారిలో ఎక్కువ శాతం ప్రజలు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని పొందుతున్నారు. అనేక రకాలైన వైద్య పరీక్షలు కూడా ఉచితంగా అందుకుంటున్నారు. వీరందరి గుండెల్లో కేసీఆర్ పేరు నిలిచిపోయింది. వీటికి తోడు దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి తదితర పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైంది. ఇన్ని రకాలైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. కాబట్టి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష.
కండ్ల ముందే అభివృద్ధి
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం కార్యాలయాలు ఉంటాయి. తెలంగాణ సచివాలయం, రాజ్‌భవన్, ప్రగతి భవన్, మంత్రుల నివాసాలు, విద్యుత్ సౌధ వంటివి మా నియోజకవర్గంలోనే ఉంటాయి. ప్రపంచంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సరికొత్త గుర్తింపు తెచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహం నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేయడం మా అందరికీ ఎంతో సంతోషం కలిగిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలకు గుర్తుగా అమరుల స్మారక జ్యోతిని కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. దేశానికి తలమాణికంగా తెలంగాణ సచివాలయ భవనాన్ని నిర్మించడంతో పాటు దానికి డా.బీఆర్. అంబేద్కర్ పేరు పెట్టారు. ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే ప్రపంచానికే తెలిసేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
సుమారు రూ.200కోట్లతో..
ఖైరతాబాద్ నియోజకవర్గంలో విపరీతంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా గతంలో డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాలువల నిర్మాణం జరగలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో మురుగు సమస్యలు తీవ్రంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలంలో బస్తీలు, కాలనీలతో పాటు ప్రధాన రహదారుల్లో సైతం మురుగు సమస్యలు కనిపించేవి. గత ఐదేండ్లలో నియోజకవర్గంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చేందుకు సుమారు రూ.200 కోట్ల దాకా ఖర్చు చేశాం. సివరేజ్లైన్ల సామర్థ్యం పెంచడంతో పాటు ఆయా ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. పలు బస్తీల్లో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో కమ్యూనిటీహాల్స్ నిర్మించాం. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నాం. వర్షాల కారణంగా వరదనీరు రోడ్లపై చేరకుండా పలు ప్రధాన కూడళ్లలో వరదనీటి లైన్లను ఏర్పాటు చేయించాం. పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద గతంలో భారీగా వరదనీరు నిలిచేది. సుమారు 6కోట్ల వ్యయంతో అక్కడి సమస్యలను పరిష్కరించగలిగాం. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. లబ్ధిదారులకు అందజేశాం.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో..
తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరూ గుర్తించారు. గతంలో సాగునీరు, తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కరువు అనే మాట లేకుండా చేసిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో నీటి సమస్యలు రాకుండా దూరదృష్టితో వ్యవహరించారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా దక్షిణ తెలంగాణలో కూడా అద్భుతాలు సృష్టించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీ నాయకత్వానికి తోడు మున్సిపల్, ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ పనితీరుపై ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. మంత్రి కేటీఆర్ చొరవతోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అనేక సంస్థలు తమ పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటున్నాయి. మంత్రి కేటీఆర్ వల్లే తమకు భవిష్యత్‌లో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. అందుకే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తాను.