GHMC | సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన 9వ పాలకమండలి సమావేశం రసాభాసగా జరిగింది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఘర్షణ పడుతున్నా.. ఆపలేక, సభను నియంత్రించలేక మేయర్ చేతులెత్తేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సభ 10.46 నిమిషాలకు 15 నిమిషాలు, మళ్లీ 11.50 గంటలకు ఐదు నిమిషాల ట్రీ బ్రేక్, 12.50 నిమిషాలకు మరోసారి, మధ్యాహ్నం 1.30 తర్వాత నాలుగు సార్లు వాయిదా వేసి.. చివరకు సభను నిరవధిక వాయిదా వేసి కౌన్సిల్‌కు ముగింపు పలికారు.
మేయర్ రాజీనామాకు పట్టు
కాంగ్రెస్ ప్రభుత్వం నగరాభివృద్ధిని, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభ ప్రారంభంలోనే ప్లకార్డులతో మేయర్ పోడియంను ముట్టడించారు. మేయర్ పదవికి రాజీనామా చేయాలని పట్టుపట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ మారిన వారంతా వెంటనే రాజీనామా చేసి గెలవాలని గొడవ చేశారు. ‘ముందు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరూ? అంటూ మేయర్ వ్యంగ్యంగా మాట్లాడటంతో దూమారం రేగింది.
సభ్యుల ఆందోళనలతో సభ అట్టుడికింది. ఇకనైనా ప్రభుత్వం రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించకుంటే రానున్న రోజుల్లో అన్ని వేదికలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అది ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత అని ముక్తకంఠంతో చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ఆఫిషియో హోదాలో సభకు వచ్చి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అండగా నిలబడ్డారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.
కమిషనర్ కూర్చొని మాట్లాడటంతో..
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వర్షాకాలం యాక్షన్ ప్లాన్‌పై వివరించారు. ఈ సందర్భంగా ఆమె కూర్చొని మాట్లాడుతుండగా సభ్యులు నిల్చొని మాట్లాడాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆమ్రపాలి క్షమాపణ కోరి.. లేచి నిలబడి వివరాలు వెల్లడించారు.
బీజేపీ..ఎంఐఎం కార్పొరేటర్ల బాహాబహీ
గ్రేటర్ తాగు, మురుగునీటి సమస్యలు పరిష్కరించాలని, అధ్వాన రోడ్లను బాగు చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ట్యాక్స్ కలెక్షన్ ఫుల్-అభివృద్ధి నిల్ అంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల దోస్తీ.. సమస్యలతో ప్రజల సుస్తీ’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఫొటోతో ప్లకార్డు ప్రదర్శన రగడకు దారి తీసింది. అసదుద్దీన్ ఉన్న ప్లకార్డును వెంటనే తీసేయాలని బీజేపీ కార్పొరేటర్లతో ఘర్షణకు దిగారు. రెండు సార్లు ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు ప్లకార్డును లాక్కొని ఎంఐఎం కార్పొరేటర్లు చించేసి సభలో చెల్లాచెదురుగా గాల్లోకి విసిరేశారు. కాగా, ఎన్నికల కోడ్ ముందే రోడ్ల మరమ్మతులకు బడ్జెట్ మంజూరు అయ్యిందని, నిధులు కేటాయింపు జరిగినా ఎందుకు విడుదల చేయలేదని అధికారులను నిలదీస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి లేఖ కావాలి అని అధికారులు సమాధానం చెబుతున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి మండిపడ్డారు. అంతకుముందు ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధులు లాస్య నందిత, కార్పొరేటర్ సబీనా బేగం, రాజ్యసభ సభ్యుడు శ్రీనివాస్‌కు సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
ప్రభుత్వం కక్షపూరిత వైఖరి :ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్ నగర ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంభిస్తూ నగరాభివృద్ధిని విస్మరించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు. ప్రజల సమస్యలు, నగరాభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్వాకంతో హైదరాబాద్ ఖ్యాతి రోజురోజుకు దిగజారుతున్నదని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతి అంశాన్ని పరిశీలించి.. నగరానికి ఎన్నో కీర్తి ప్రతిష్టతలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌లది అని చెప్పారు. అభివృద్ధి వైపు వెళ్లకుండా సీఎం రేవంత్‌రెడ్డి కండువాలతో రెడీగా ఉంటున్నారని చెప్పారు. స్వయంగా మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి..ఒక్కరోజైనా జీహెచ్ఎంసీపై సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో వెళ్లేందుకు సమయం ఉంటుందని కానీ నగరాభివృద్ధిపై చర్చించేందుకు సమయం ఉండదన్నారు. వర్షాకాలం వచ్చింది పనులు చేయాలంటున్న మా కార్పొరేటర్లను నిధులు కావాలంటే కరీంనగర్ మంత్రి చుట్టూ తిరగండి అని అధికారులు సమాధానం చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. మేయర్ తన నైతికతను కోల్పోయారని, ప్రజావాణిని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు.వర్షాకాలం ప్రారంభమైనందున నగరంలో ఎదురయ్యే పలు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. సుమారు 150 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామని, వాటర్ లాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మాన్సూన్లో వ్యాధులు ప్రబలకుండా, దోమల నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
-జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
రెవెన్యూ పెంచడమే లక్ష్యంగా జీఐఎస్
జీహెచ్ఎంసీలో జీఐఎస్ సర్వే కొనసాగుతున్నదని, ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ప్రస్తుతం డ్రోన్ సర్వే జరుగుతున్నదని, త్వరలోనే ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందన్నారు. గ్రేటర్లో 19 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయని, 25 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏటా రూ. 1900కోట్లు ఉన్న ఆదాయం అదనంగా మరో రూ.వెయ్యి నుంచి రూ.1500కోట్ల మేర ఆదాయం పెరిగే అవకాశం ఉందని, ఈ జీఐఎస్ విధానానికి కార్పొరేటర్లు సహకరించాలని స్నేహ శబరీశ్ కోరారు.
– అదనపు కమిషనర్, స్నేహ శబరీష్
అవినీతి అధికారులపై చర్యలేవి ?
అక్రమ నిర్మాణాలు జరగడానికి అవినీతి అధికారులే కారణమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన లాబీలో మీడియాతో మాట్లాడారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు.
– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ప్రభుత్వ స్థలాలను రక్షిస్తాం
మాన్సూన్ సీజన్లో డి సిల్టింగ్, వాటర్ లాగింగ్ కాకుండా తమ బృందాలు అన్ని వేళలా క్షేత్ర స్థాయిలో ఉంటాయని, ట్రాఫిక్ సజావుగా వెల్లే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాలు, లేక్స్, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘
– ఈవీడీఎం కమిషనర్,ఏవీ రంగనాథ్
ప్రజలు అసహ్యించుకుంటున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల్లోనే బరితెగింపులకు పాల్పడుతున్నదని, ఇద్దరు, ముగ్గురొచ్చినా రాత్రికి రాత్రే కండువా కప్పే పద్ధతి చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. 2/3 సంఖ్య లేకపోయినప్పటికీ సింగిల్‌గా కండువాలు కప్పి చేర్చుకుంటున్నారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో చేర్చుకోవడం వల్లే కౌన్సిల్లో గందరగోళ పరిస్థితులు వచ్చాయని, కౌన్సిల్ పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్‌లో మరి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందన్నారు.
– ఎంపీ ఈటల రాజేందర్