సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నగరం పోలీసు వలయమైంది. నందినగర్ ఖాకీల నిర్బంధంలోకి వెళ్లింది. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసుల పహారా కనిపించింది. ఆదివారం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు, ఎటు చూసినా హడావిడితో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులయ్యాయి.
చిన్నచిన్న గల్లీల్లో సైతం పోలీసులే కనిపించారు. కేసీఆర్‌ను నందినగర్ నివాసంలో సిట్ బృందం విచారిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం పోలీసుల కంట్రోల్లోకి తీసుకున్నారు. వాహనాలకు గులాబీ జెండా కనిపించినా, గులాబీ చొక్కా వేసుకున్నా పోలీసులు వారిని ఆపి ప్రశ్నించడం, అదుపులోకి తీసుకోవడం కనిపించింది.నగరమంతా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లు, ధర్నాలు చేయకుండా అడ్డుకోవడాలు, గృహనిర్బంధాలతో పోలీసుల హంగామా కనిపించింది. సుమారు 300 మంది పోలీసులను నందినగర్, తెలంగాణ భవన్ చుట్టుపక్కల మోహరించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ నివాసం నందినగర్ వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఉదయం నుంచే ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్న పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు అటువైపు రాకుండా ముందస్తుగా అరెస్ట్‌లకు దిగారు. ఒకవైపు కేసీఆర్ నివాసం వద్ద పోలీసులను ఉంచడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జహీరానగర్ నుంచి నందినగర్వైపు వెళ్లేదారి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కేసీఆర్ గృహానికి వెళ్లే రహదారి, రోడ్‌నెంబర్ 14 నుంచి నందినగర్, రోడ్‌నెంబర్ 3 నుంచి నందినగర్‌కు వెళ్లే రహదారుల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.
కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత నిరసనకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసులు గులాబీ శ్రేణులను ముందస్తు అరెస్టులతో పాటు గృహనిర్బంధాలు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్చార్జి మాగంటి సునీత గోపీనాథ్ యూసుఫ్‌గూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. వారు ఎలాంటి నిరసనలు తెలుపకుండా పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని రహమత్‌నగర్‌లోని శ్రీరాంనగర్‌లో, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, ముఖ్యనేతలు మన్నెగోవర్ధన్‌రెడ్డి, వెల్డండ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహమత్‌నగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లకు చెందిన ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధించారు.
బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీర్‌ను సిట్ అధికారులు విచారణ చేస్తుండడంతో ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు కేసీఆర్ నివాసానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. శివారు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను నగరంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి సిటీలోకి రాకుండా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.