Manikonda | మణికొండ, మార్చి 19 : మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రతిరోజు స్థానిక కాలనీలను, బస్తీలను సందర్శిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో భాగంగా బుధవారం పుప్పాలగూడ పరిధిలోని సాయి చంద్ర కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు పర్యటించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయి చంద్ర కాలనీ వాసులు అనేక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చి తక్షణమే పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు.
కాలనీవాసులు నాయకులు దృష్టికి తీసుకువచ్చిన అంశాలు..
1. మణికొండ పురపాలక సంఘ పరిధిలోని పలు కాలనీల ప్రజానీకం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రాంగుడాల రాకపోకలకు సాయి చంద్ర కాలనీలో ఉన్న రెండు రోడ్లను ఉపయోగిస్తున్న కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొని ఉందని, రోడ్ ఫేసింగ్‌లో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలంటేనే ట్రాఫిక్ కారణంగా భయపడుతున్నారని, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా స్పీడ్ బ్రేకర్ అమర్చాలని కోరారు.
2. కాలనీలో రెండు పార్కులు ఉన్నప్పటికీ శుచిశుభ్రత పాటించడం లేదని, ఓపెన్ జిమ్ ఉన్న చిన్న పార్కు ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు వేసిన టైల్స్ ను ఎవరో తొలగించడం, అట్టి పార్క్ గేటు వద్ద రోబో సాండ్ పోసి పార్కును నిరుపయోగంగా ఉంచారని వాపోయారు.
3. పుప్పాలగూడ స్మశాన వాటిక పక్క నుంచి బిఆర్సీకి వచ్చే రహదారి చిత్రవిచిత్రంగా మలుపులు తిరిగి ఉన్నదని దీంతో వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
4. స్మశాన వాటిక పక్కన జలమండలి అధికారులు 1 ఏం.ఎల్.డీ రిజర్వాయర్ కట్టి సాంకేతిక కారణాల వలన వాడుకలోకి తీసుకురాకపోవడం వింతగా వుందని, ప్రస్తుత నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని వాడుకలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
5. పుప్పాలగూడ ధోబి ఘాట్ శిలాఫలకాన్ని పరిశీలిస్తే, అభివృద్ధి కోసం రెండు కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. కానీ అభివృద్ధి పరంగా చూస్తే రెండు కోట్లకు తగ్గట్టుగా కనిపించడం లేదని కాలనీవాసులు నాయకులు దృష్టికి తీసుకువచ్చారు.
6. రాత్రిపూట కుక్కల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు వీధి శునకాల సంరక్షణ కొరకు తొందరగా షెల్టర్ హోమ్ నిర్వహించాలని స్థానికులు కోరారు. సంబంధిత అధికారులు పై సమస్యలపై దృష్టి కేంద్రీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు సీతారాం తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, గోరుకాంటి విఠల్, సంఘం శ్రీకాంత్, దిలీప్, యాలాల కిరణ్, భాను చందర్, సుమనళిని, రమణ మూర్తి, తిరుపతి తది తరులు పాల్గొన్నారు.