హైదరాబాద్ : అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మిగిలిన ఇండ్లను స్థానికేతరులకు కేటాయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ ఆవేదన ను వెలిబుచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు లేఖను రాశారు.
ఈ లేఖను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, లబ్ధిదారులు జాయింట్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, పీడీ అశోక్ లకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం లో అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపు చేసినట్లు అధికారులకు పవన్ కుమార్ గౌడ్ వివరించారు. కాగా అర్హుల ఎంపిక జరగకపోవడం వలన కొన్ని ఇండ్ల కేటాయింపు నిలిచిపోయిందని, నాటి నుండి అవి ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. అర్హులైన వారి దరఖాస్తు లు అధికారుల వద్దనే పెండింగ్ లో ఉండగా, స్థానికేతరులకు ఎలా కేటాయిస్తారని లబ్ధిదారులు అధికారులను ప్రశ్నించారు.
స్థానికేతరులకు కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా వెంటనే అర్హులైన వారిని గుర్తించి ఇండ్ల ను కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు శ్రీహరి, లక్ష్మీపతి, శేఖర్, ఆరీఫ్, వెంకట్ బాబు, కోటేశ్వర్ గౌడ్, నసీమా తదితరులు ఉన్నారు.