హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిర్వహించే రోడ్‌షోలో సెక్యూరిటీ కోసం డ్రోన్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను బీఆర్ఎస్ నాయకులు కోరారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీపీ సజ్జనార్‌ను బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, బాలరాజ్యాదవ్ కలిసి వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ప్రచారానికి డ్రోన్లు వాడుకుంటామని వారికి తెలిపారు.. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను, జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారు అని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు సీపీ సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు.