శామీర్‌పేట, జూన్ 11 : ప్రభుత్వం భూములు అమ్ముకుంటే కోట్లలో.. అదే నిరుపేద వద్ద లాక్కుంటే వేలు, లక్షలేనా ? ఇదెక్కడి న్యాయమంటూ.. భూ నిర్వాసితులు ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, భూ సేకరణ అదనపు కలెక్టర్ మాలతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభను బహిష్కరించి రోడ్డెక్కారు. రాజీవ్ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. మందాయిపల్లి చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
అంతటితో ఆగని భూ నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. అవసరం లేకున్న భూ సేకరణ పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలయాపన కోసమే గ్రామ సభలంటూ.. రోజులు గడుపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణతో గత ఏడాదిగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్న భూ నిర్వాసితులను మూలుగుతున్న నక్కపై తాటికాప పడ్డ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా కష్టాలనే పెడుతున్నదని దుమ్మెత్తి పోశారు.
ఉప్పల్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. అవసరానికి మించకుండా భూ సేకరణ 200 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన ఉండగా, ప్రజాభిప్రాయం మేరకు కేవలం 150 ఫీట్లు మాత్రమే భూ సేకరణ నిర్వహించారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ చేపట్టి భూమిని కోల్పోయిన బాధితులకు తమ భూమికి సమాన విలువగా, ఉప్పల్ భగాయత్‌లో భూమిని చెల్లించినట్లు పదే పదే గుర్తు చేశారు.
ప్రజాభిప్రాయం మేరకు భూ సేకరణ నిర్వహించాలి..
తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలో ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాజీవ్ రహదారిపై పారడైజ్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఏర్పాటు చేయనున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజాభిప్రాయం మేరకు భూ సేకరణ చేపట్టాలన్నారు. ప్రస్తుతం రద్దీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అవసరం మేరకు భూ సేకరణ చేపట్టాలన్నారు. వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు నిర్వహించే ఈ రాజీవ్ రహదారిపై 200 ఫీట్లు రోడ్డు విస్తరణ ఎందుకని ప్రశ్నించారు. 100 ఫీట్ల మేరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు.
ఈ భూ సేకరణతో వందల కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. ఇప్పటికే 450 మంది భూ సేకరణకు వ్యతిరేకంగా కేసులు వేశారని, అవన్నీ పట్టించుకోకుండా.. భూ సేకరణకు అభిప్రాయ సేకరణ అంటూ ఇంకా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పేడుతూనే ఉందన్నారు. 100 రోడ్డుకు సమ్మతమేనని, కోల్పోయిన భూమికి భూమినే కేటాయించాలని చెబుతూనే అందుకు ఉదాహరణగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఉప్పల్ రోడ్డు విస్తరణ పనులు, నాగపూర్ రోడ్డు మార్గాల విస్తరణను గుర్తు చేశారు.
భూ సేకరణలో భూములు కోల్పోతున్న బాధితులకు భూమికి భూమిని మార్కెట్లో సమాన విలువగల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. భూ సేకరణ ఎంత జరుపుతారు..? భూమిని కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారు ? భూమికి భూమి ఇస్తారా లేదా అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు సమావేశం నుంచి జారుకున్నారు. దీంతో సభను బహిష్కరించిన భూ నిర్వాసితులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.