GHMC | అబిడ్స్, మే 31: గోషామహల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ దుబ్బాక లావణ్యను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలో నాలా, కచ్చా మోరీల పూడికతీత పనులు వెంటనే చేపట్టి వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి కారణంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. గోషామహల్ నియోజకవర్గంలో గంటసేపు వర్షం పడితే రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై కుంటలు చెరువులను తలపిస్తాయని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు నాలా, కచ్చా మోరీల పూడికతీత పనులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మూడు నెలలుగా అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా అభివర్ణించారు. విజయ మార్కెట్ విక్రాంతి థియేటర్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్ ను అక్రమంగా కూల్చి వేశారని, వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేసిన సులభ్ కాంప్లెక్స్ స్థానంలో ప్రజల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నగరంలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆనంద్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే సిబ్బంది లేరని సమాధానం ఇస్తున్నారని, సిబ్బంది లేకపోతే జీహెచ్ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయానికి టులెట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.