BRS | సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మహిళాలోకం కన్నెర్ర చేసింది.. నిరసనలు, ధర్నాలతో హోరెత్తించింది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిపై అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలంటూ..
గురువారం నగరవ్యాప్తంగా ఆడపడుచులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. నిండు సభలో ఆడబిడ్డలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఓటుకు నోటు దొంగ రేవంత్రెడ్డి’.. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలంటూ నిజాం కళాశాలలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు.
పలు చోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశా రు. బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలు సైతం రోడ్లపై బైఠాయించారు. ప్రతి ఆడబిడ్డకు ఆ వ్యాఖ్యలు అవమానకరమంటూ.. ధ్వజమెత్తారు. తెలంగాణ సంప్రదాయం అంటేనే మహిళలను గౌరవించడమన్నారు.
కాంగ్రెస్ ఆడపడుచులను చిన్నచూపు చూడటం మానుకోకపోతే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, ధర్నా, రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులను పోలీసులు లాక్కెళ్లి.. బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి.. పోలీస్స్టేషన్లకు తరలించారు. అయితే అరెస్టులతో తమను ఆపలేరంటూ.. నాయకులు హెచ్చరించారు.