సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి భగ్గుమన్నది. మహిళా లోకాన్ని కించపరిచేలా చేసిన ఈ వ్యాఖ్యలపై మహా నగరవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను చెప్పులు, చీపుర్లతో కొడుతూ… బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మహిళలను కించపరిచేలా మాట్లాడిన బండి సంజయ్ మహిళా లోకానికి, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. నిరసనల అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు నగరవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని అనేక చోట్ల బండిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మరోవైపు బండి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డితో పాటు అనేక మంది మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లారు. కానీ పోలీసులు లోపలికి అనుమతించలేదు.
ఒక మహిళా గవర్నర్ అయి ఉండి, మహిళలను రాజ్‌భవన్‌లోకి అనుమతించకపోవడంపై మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతించకపోవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉదయం నుంచి అపాయింట్మెంట్ కోరుతున్నా గవర్నర్ స్పందించడంలేదని, చివరకు వినతిపత్రం తీసుకునేందుకు కూడా గవర్నర్ అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్ గోడకు వినతిపత్రాన్ని అంటించారు. ఆ తర్వాత ర్యాలీగా వెళ్లి ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి
Vijaya
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని నిరసిస్తూ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా, పలువురు కార్పొరేటర్లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.
నోరు అదుపులో పెట్టుకోవాలి
మహిళల గురించి మాట్లాడేటప్పుడు బండి సంజయ్ నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలి. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే బండి సంజయ్‌కు మహిళలే సరైన గుణపాఠం చెబుతారు. బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలనడానికి బీజేపీ నేతల ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనం.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, బీఆర్ఎస్ పార్టీ
బండిని అరెస్టు చేయాలి
ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎంపీ బండి సంజయ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో ఆయనపై భౌతికదాడులకు సైతం వెనుకాడబోం. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేయాలి. బీజేపీని ప్రజలు బొందపెట్టి, బీఆర్ఎస్ను త్వరలోనే గెలిపిస్తారు. ఇకనైనా ఒంటెద్దు పోకడలు మానుకొని తక్షణమే క్షమాపణలు చెప్పాలి.
– డాక్టర్ తుంగ బాలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఓర్వలేకే నోటికొచ్చినట్లు మాటలు..
ఎన్నో రకాలైన కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ కుట్రలు ఎన్నటికీ సాగవు. ఉద్యమకారుడి కుమార్తె కల్వకుంట్ల కవిత వీరనారిలా పోరాటం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఢిల్లీలో కల్వకుంట్ల కవిత అద్భుతమైన దీక్ష నిర్వహించారు. అనేక పార్టీల నాయకులు కవిత దీక్షకు సంఘీభావం తెలిపారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు.
– ఎమ్మెల్యే దానం నాగేందర్
మహిళలే బుద్ధి చెబుతారు
ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా, ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సమంజసం కాదు. సభ్యతా సంస్కారం లేకుండా మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలి. రానున్న రోజుల్లో మహిళలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయం.
– మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
బీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే…
బీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతుంది. లిక్కర్ కుంభకోణంలో తన ప్రమేయం లేనందు వల్లే ఎమ్మెల్సీ కవిత ధైర్యంగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ధోరణిని తెలంగాణ ప్రజల గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– కోలేటి దామోదర్, తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
వెంటనే క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్‌కి అక్కా చెల్లెలు లేరా ? ఆయనను వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆయనను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలి.
– గజ్జెల నాగేశ్, చైర్మన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్
విలువలు లేని వ్యక్తి బండి..
బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల విలువలు తగ్గిపోయాయి. ఆయన విలువలు లేని వ్యక్తి. జాగృతి అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక ప్రదర్శించారు. బండి సంజయ్ కండ్లకు కామర్లు వచ్చి అనుచితంగా మాట్లాడటం సిగ్గు చేటు.
– జ్ఞాని నివేదిత, నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా నేత, కంటోన్మెంట్