BRS Leaders | వనస్థలిపురం, ఫిబ్రవరి 18 : అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు, రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని హస్తినాపురం మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారిలు ధ్వజమెత్తారు. మంగళవారం జెడ్పీ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారన్నారు. నందనవనంలోని లక్కీ హోటల్ వద్ద తాము కేక్ కట్ చేశామన్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో మూడు మొక్కలు నాటామని, పిల్లలకు చాక్లెట్లు పంచామన్నారు. ఇందులో అంతపెద్ద తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత మధు యాష్కి పీఏ, కార్పొరేటర్ సుజాత నాయక్ పీఏలు విద్యా శాఖ అధికారులపై వత్తిడి తెచ్చి ఇన్చార్జి హెడ్ మాస్టర్ రజితను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా పాఠశాలలోకి చొరబడ్డారని.. వారిపై కేసు పెట్టాలని టీచర్‌పై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అందుకు ఆమె నిరాకరిచండంతో సస్పెండ్ చేయించారన్నారు. ఈ తతంగంలో అసలు టీచర్ పాత్ర ఏముందని ప్రశ్నించారు.
అభివృద్ధి చేయడం చేతకాక ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు. తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మొక్కలు కూడా నాటవద్దా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంజూరు చేయించిన నిధులకు స్థానిక కార్పొరేటర్ పనులు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకుంటే ప్రతీ చోట కార్పొరేటర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. వసూళ్లకు ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించి, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. టీచర్ రజితను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కాంగ్రెస్ నాయకుల కుట్రలను ఎల్బీనగర్ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమావత్ శ్రీనునాయక్, రఘుమారెడ్డి, విష్ణుగౌడ్, నిర్మల, భిక్షపతి, మహ్మద్ సయీద్ పాషా, సంగిపేట్ నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.