కడ్తాల్, మార్చి 17 : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా, సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాం ఎదుట మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మౌన దీక్షను చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జర్నలిస్టులపై అపర ప్రేమను కనబరిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పత్రికలపై విషం చిమ్ముతుందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం తగదని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట… అధికారంలోకి రాగానే మాట మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా… ప్రతిపక్షాల నేతలను బట్టలు ఊడదీస్తా, రోడ్లపై ఉరికిస్తా అనే వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు.
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ అవివేకానికి నిదర్శమనని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంతో సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధంలేదని, ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని హితవు పలికారు. జర్నలిస్టులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, బీఆర్ఎస్ కడ్తాల్ గ్రామాధ్యక్షుడు కడారి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ రమేశ్‌నాయక్, నాయకులు పాండునాయక్, వెంకటేశ్, రామచంద్రయ్య, నాగార్జున, అంజినాయక్, శ్రీనునాయక్, కుమార్, వాచ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.