KCR | బంజారాహిల్స్, జూలై 5 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో పాటు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐడ్రీమ్స్ చానెల్ యాంకర్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడుతూ.. గత నెల 24న ఐడ్రీమ్స్ తెలుగు చానెల్లో యాంకర్ సౌమ్యారెడ్డి, న్యాయవాది అరుణ్‌కుమార్‌ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో అనేక అబద్దాలు, నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 1990 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేయించాడని, 40వేల ఫోన్లను ట్యాప్ చేసి ఫామ్‌హౌజ్‌లో భారీ స్క్రీన్ పెట్టుకుని విన్నాడంటూ అవాకులు చెవాకులు పేలారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టీఆర్పీ రేటింగ్స్ కోసం పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ సౌమ్యారెడ్డి, న్యాయవాది అరుణ్‌కుమార్‌తో పాటు ఐడ్రీమ్స్ చానెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, గాంధీనాయక్, మధిర నియోజకవర్గం మాజీ ఇంచార్జి బమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.