BRS | సిటీబ్యూరో: ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్లపైనే ఫోన్ ట్యాంపింగ్ ఆరోపణలు చేస్తారా? వాళ్లు ఏదైనా చేస్తారు..? వాళ్లపై ఫిర్యాదు ఇవ్వడానికి మీకెంత ధైర్యం అన్నట్లు హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తూ.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారంటూ.. నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకే ఈ పరిస్థతి ఉంటే సామాన్యులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు ఇవ్వగలరా? అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అరెస్టును ఖండిస్తూ అక్రమ అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును అరెస్టు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టును నిలదీసినందుకు హరీశ్‌రావు, మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితర నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష్యపూరిత చర్యలకు పాల్పడుతున్నదని, ప్రజాపాలన అంటూ ఓవైపు చెబుతూ మరో వైపు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
కౌశిక్‌రెడ్డిపై బుధవారం రాత్రి అక్రమ కేసును బనాయించిన బంజారాహిల్స్ పోలీసులు, గురువారం తెల్లవారుజామునే ఆయనను అరెస్టు చేసేందుకు వెళ్లడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఒక ఎమ్మెల్యే వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ ఫిర్యాదు తీసుకోకుండా తప్పించుకుపోయే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
తమ ఉన్నతాధికారులపై వచ్చే ఫిర్యాదులను తామేలా తీసుకోవాలనే భావనతో అటు ఏసీపీ, ఇటు ఇన్స్పెక్టర్ తమ కార్యాలయాల నుంచి జారుకోవడానికి ప్రయత్నించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఫిర్యాదు తీసుకోవాలన్న పాపానికి పోలీసులు, ఫిర్యాదుదారుడిపైనే కేసులు నమోదు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల పనితీరుకు నిదర్శనంగా ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చట్టం ప్రకారం కాకుండా రేవంత్ ప్రత్యేక చట్టం ప్రకారం పనిచేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
ఒక ఎమ్మెల్యే ఫిర్యాదుపైనే పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు చేసే అన్యాయాలు, అక్రమాలపై సామాన్య ప్రజలు ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు వస్తారా? అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేపైనే పోలీసులు కే సు నమోదు చేశారు, ఇదే భయాన్ని సామాన్యులకు కూడా ఉంచాలని రేవంత్ సర్కార్ పక్కా ప్లాన్‌తో ఈ కేసు నమోదు చేయించి, కౌశిక్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.