మణికొండ,జనవరి 30 : జలమండలిలో ఐదేండ్ల నీటి బకాయిలు ఒకేసారి చెల్లించాలంటూ హుకూం జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల బిల్లులు వేయకుండా తమకు తెలియని బిల్లులను ఇప్పడు చెల్లించాలని కోరడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బాధితులు జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నార్సింగి సర్కిల్ పరిధిలో జలమండలి ఐదేండ్ల నీటి బిల్లును ఒకేసారి స్థానికులపై మోపింది. నెలనెల బిల్లులు వేసి వసూలు చేయడం జలమండలి బాధ్యత. జలమండలి నిర్లక్ష్యానికి ప్రజలు లక్షలు,వేలల్లో బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో నార్సింగి గ్రామ పంచాయితీగా ఉన్న సమయంలో నీటి బిల్లులు పూర్తిస్థాయిలో వసూలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, నార్సింగి జీహెచ్ఎంసీలో విలీనమయ్యాక ఆడిట్ సమయంలో 5 ఏండ్ల బకాయిలు ఉన్నట్టు తేలిందని అంటున్నారు. అయితే జలమండలి నిర్లక్ష్యానికి తామెందుకు నష్టపోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
తాగునీరు ప్రజల చట్టబద్ధతో కూడిన హక్కును అందుబాటులోకి తేవడం ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అని తెలిసినా జలమండలిశాఖ ఇష్టానుసారంగా బిల్లుల మోతతో ప్రజల నడ్డివిరుస్తోందని తక్షణమే బిల్లులను వెనక్కి తీసుకోవాలంటూ నార్సింగి జీహెచ్ఎంసీ సర్కిల్ అఖిల పక్ష నాయకులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్లకార్డులను చేతబట్టి నీటి బిల్లులను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. ఏనాడు సక్రమంగా నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవని, ఎక్కడా..ఏ మోతాదులో నీటి సరఫరా చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్న జలమండలిశాఖ ఏ ప్రాతిపదికన ఐదేళ్ల నీటి బిల్లులను జారీ చేసిందో చెప్పాలంటూ ప్రజలు ధ్వజమెత్తారు.
మొత్తం బకాయిలను రద్దు చేయాలంటూ జలమండలిశాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. నార్సింగి జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని మణికొండ, నెక్నాంపూర్, నార్సింగి, కోకాపేట, గండిపేట డివిజన్ల వరకు ఐదేళ్ల నీటి బకాయిలు చెల్లించాలంటూ ప్రజలకు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీటి బిల్లులను తక్షణమే రద్దుచేసి నూతన పద్ధతిలో బిల్లింగులు చేయాలంటూ నిరసించారు. ఈ సందర్భంగా మణికొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ మాట్లాడుతూ ఐదేండ్లుగా లెక్కలు లేని నీటి బిల్లులు, అదనపు రుసుములు వసూళ్లు చేయాలని ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తూ రుసుము చెల్లించకపోతే నీటి సరఫరా ఆపేస్తామంటూ జలమండలి శాఖ దౌర్జన్యకర పద్ధతిని అవలంభిస్తోందని మండిపడ్డారు.
నీటి బిల్లులపై ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అఖిలపక్ష నాయకులతో సమావేశమై శాంతియుత నిరసన చేపట్టామన్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మణికొండలోని 18వ డివిజన్ జలమండలిశాఖ అవలంభిస్తున్న తీరుపై నిరసన తెలుపుతున్నట్లు సీతారాం అన్నారు. ఈ క్రమంలో భాగంగా వివిధ కాలనీ ప్రజలు జలమండలిశాఖ తీరును నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానంపై ఆరోపణలు చేశారు. అనంతరం జలమండలి శాఖ జీఎం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రెండు బిల్లులను ఉదహరిస్తూ..మొత్తం బకాయిలను రద్దు చేయకుండా బకాయిలను రద్దు చేయాలని విన్నవించారు.
బకాయిలు రద్దు చేయకుండా వాయిదాలుగా వసూలు చేస్తామని చెప్పడం ఏడ్చేవాడి కళ్లు తుడిచినట్టు ఉంటుందని స్థానికులు జీఎం ముందు మొరపెట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా చర్యలు తీసుకుంటామని జలమండలి జీఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్‌స్వామి, నాయకులు సిద్ధప్ప, రవికాంత్‌రెడ్డి, సాయిరెడ్డి, ధన్‌రాజ్, నరేందర్, అందెలక్ష్మణ్, శ్రీకాంత్, ఆరీఫ్, ఆనంద్‌రావు,శివకుమార్, బాబురావు, సుమనళిని, వివిధ కాలనీల సంక్షేమ సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.