సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ మృతిపై న్యాయ వి జరపాలని ఆ పార్టీ నాయకులు బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సర్దార్ది ఆత్మహత్య కాదనీ.. అది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత హత్య అని పేర్కొన్నారు. న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారని స్పష్టంగా తెలుస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగా సర్దార్, కృష్ణ మోహన్, ఫయాజ్ తదితర పార్టీ కార్యకర్తలపై నిరాధారమైన ఆరోపణలు, వేధింపులు చేశారని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి నిరాకరించినప్పటి నుంచి ఆయనను ప్రతీకార లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. గడువు ముగిసిన మందులను అమ్మారనే ఆరోపణలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు సర్దార్ మెడికల్ షాపుపై దాడులు జరిపారని వివరించారు. ఈ ఘటన సర్దార్‌ను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు. కాగా, రహమత్‌నగర్ డివిజన్లోని సంధ్య కన్వెన్షన్‌కు చెందిన శ్రీధర్‌రావు, నేను దివంగత మాగంటి గోపీనాథ్‌ను చంపడానికి చేతబడి చేశాను.. మరియు మీరు కూడా అదే విధంగా చస్తారు.
’ అని బెదిరింపులు చేస్తున్నట్టు వీడియోలు వెలువడ్డాయని సీపీకి తెలిపారు. ఈ బెదిరింపులపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నా బోరబండ పోలీసులు నిర్లక్ష్యంగా విచారణ జరపడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తున్నదని చెప్పారు. అనంతరం సీపీ సానుకూలంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. కాగా, సీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.