Balkampet | అమీర్‌పేట, జూన్ 18 : చారిత్రాత్మక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసి రావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దేవాలయ పాలకమండలి మాజీ సభ్యులు సింగారపు శ్రీనివాస్ గుప్తా, బూర్గుల ఉమానాథ్ గౌడ్లు పిలుపునిచ్చారు. దేవాలయం (ఎఫ్ఏసీ) ఈవో గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఎల్లమ్మ ఉత్సవాల నిర్వహణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు గత దశాబ్దకాలంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా చేపడుతూ తమ సేవాభావాన్ని చాటేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.