సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బస్తీలో ఉండే పేదలను లంచాల కోసం పీల్చి పిప్పి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు కట్టినా, మరమ్మతులు చేసినా అడిగినంత లంచం ఇవ్వాల్సిందేనంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. లంచం ఇవ్వలేదంటే బల్దియా సిబ్బందికి చెబుతూ..ఇండ్లు కూల్చేయడం, ఇంటి ముందు ఉండే నిర్మాణా సామగ్రిని పాడుచేయించడం, జరిమానాలు వేయించడం.. అతడి వేధింపులు ఒకటి కాదంటూ స్థానికులు వాపోతున్నారు. అతడి కుటుంబ సభ్యులు, పీఏ సైతం ఈ వేధింపుల్లో పాలుపంచుకుంటున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అతడి వేధింపులతో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహమ్మద్ సర్దార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
– బోరబండ వినాయకరావునగర్‌లో 75 గజాల స్థలంలో తనకున్న జీప్లస్ టు ఉన్న ఇంటిపై మరో రెండు అంతస్తులు కడుతుంటే అక్కడకు జీహెచ్ఎంసీ అధికారులను పంపి ఇంటిని సీజ్ చేయించాడని బోరబండకు చెందిన న్యాయవాది కృష్ణమోహన్ వివరించారు. తాను బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నందుకు తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తన ఇంటిని కార్పొరేటర్ ఫసియుద్దీన్ సీజ్ చేయించడంతో ఇండ్లు లేక తన భార్యతో పాటు ఐదేండ్ల కుమారుడిని తన స్వస్థలం సిద్దిపేటకు పంపి, తాను చెట్ల కింద , తెలిసిన వారి ఇండ్లలో తలదాచుకుంటూ కాలం నెట్టుకొస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బోరబండ డివిజన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయిన సైట్ఫోర్, ఫైవ్ కాలనీ అధ్యక్షుడు ఫయాజ్‌ఖాన్ తన 100 గజాల స్థలంలో ఇండ్లు కడుతుంటే బల్దియా అధికారులను పంపించి కూల్చేయించాడు. అలాగే బోరబండ బస్‌స్టాప్ వద్ద టెంకాయల దుకాణాన్ని నిర్వహించే రమేశ్‌పై ఐదు కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తూ వీధి వ్యాపారులపై కూడా తన దురాగతాలను సాగిస్తున్నాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. బోరబండ వీకర్ సెక్షన్‌లోని పాన్షాప్ను నిర్వహించే ఫిరోజ్ పాన్ దుకాణాన్ని అధికారులతో అక్కడి నుంచి తొలగింపచేశాడు. గతంలో ఓ వైద్యురాలిని పోలీసులతో కలిసి కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ పీఏ బెదిరించి.. లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 50 వేలు వసూలు చేశాడని స్థానికులు ఆరోపించారు.
కార్పొరేటర్ ఫసియుద్దీన్ అరాచకాలకు బలైన సర్దార్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కార్పొరేటర్ అరాచకాలను నిరసిస్తూ స్థానిక ప్రజలు నల్ల బ్యాడ్జీలతో సర్దార్ అంతిమ యాత్రలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.