అమీర్పేట, మార్చి 1 : రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో బీకే గూడా మసీదు బస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అమీర్పేట మాజీ కార్పొరేటర్ ఎన్. శేషు కుమారి విమర్శించారు. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నప్పటికీ బీకే గూడ మసీదు వద్ద డ్రైనేజీ సమస్యను అలాగే వదిలేశారని విమర్శించారు. తీవ్ర రూపం దాల్చిన ఈ పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని బీకే గూడ మసీదు బస్తీ ప్రతినిధులు ఇటీవల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం నాడు మసీదు ప్రాంతాన్ని సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బస్తీ అధ్యక్షులు నసీరుద్దీన్ ఖాద్రీ మసీదు చుట్టుపక్కల నెలకొన్న మురుగునీటి సమస్యతో పాటు వెలగని వీధిలైట్లు, మంచినీటి సమస్యతో పాటు ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎన్ శేషుకుమారి బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ.. రంజాన్ సమయంలో మసీదుల వద్ద ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉపవాస దీక్షలకు ముందే సంబంధిత అధికారులతో సమీక్షాసమావేశాల నిర్వహించేవారని.. మసీదుల వద్ద పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని చెప్పారు.
ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ వెంట బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎం.హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నరసింహ కట్ట బలరాం, రాజు, లక్ష్మీ, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.