సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): తన భర్త సర్దార్ బలవన్మరణానికి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీనే కారణమని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సర్దార్ భార్య సమీనాయాస్మీన్ ఆరోపించారు. సర్దార్ ప్రాణాలు తీసుకోవడానికి ముందు పలుసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పేవాడని, ఇందుకు సంబంధించి రికార్డింగ్స్ ఉన్నాయంటూ సర్దార్‌ను బాబా బెదిరించిన ఆడియోలను శుక్రవారం యాస్మిన్ మీడియాకు విడుదల చేశారు.
తన భర్త మరణానికి కారణమైన వారు దర్జాగా బయట తిరుగుతున్నారని, దోషులను శిక్షించాలంటూ రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. సర్దార్ ఆత్మహత్య చేసుకోవడానికి మూడురోజుల ముందు మే 25 రాత్రి 7 గంటల 42 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డికి సర్దార్ మెయిల్ చేసిన స్క్రీన్ షాట్ ను సర్దార్ తన స్నేహితుడికి పంపారని, అందులో “సర్..హెల్ప్ మీ” అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మెయిల్ చేసినట్లు ఉందని ఆమె మెయిల్ స్క్రీన్‌షాట్‌ను చూపించారు.
మరోవైపు సర్దార్ ఆత్మహత్యకు సంబంధించి వీడియో ఆయన ఫోన్ లో ఉండొచ్చని, ఆత్మహత్యకు కారణాలు తన భర్త ఫోన్లోని వీడియోలో ఉండే అవకాశం ఉందని ఆమె చెప్పారు. సర్దార్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, పాస్వర్డ్ చెప్పాలని రెండు నెలల తర్వాత బోరబండ పోలీసులు అడగడం విడ్డూరంగా ఉందని యాస్మిన్ చెప్పారు. తనకు న్యాయం జరగకపోతే సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట తమ కుటుంబీకులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు.