Patolla Karthik Reddy | వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్), ఏప్రిల్ 16 : రానున్న కాలమంతా బీఆర్ఎస్దేనని కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సులేమాన్ నగర్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ముస్లిం సోదరులు ప్రధానంగా, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు. గతంలో ఏ ప్రభుత్వం ముస్లింలను ఆర్థికంగా ఆదుకున్న దాఖలాలు లేవని, మలి విడత తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ఆయన తెలిపారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయగా ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ నేతలు ఏడాది గడిచిన ఎలాంటి హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు.
ప్రధానంగా శాస్త్రి పురం సులేమాన్ నగర్ డివిజన్లో ముస్లింలు పేదలుగా ఉన్న ప్రాంతంలో మురికివాడలను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని గుర్తు చేశారు. ముస్లింలకు షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు అమల్లోకి వచ్చిన వాటిని ప్రస్తుతం నిలిపివేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అయినందున వరంగల్లో తలపెట్టిన రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని సూచించారు.