హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారని, ఈ ఉప ఎన్నికలో అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని, అక్కడ ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కంటోన్మెంట్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన కోడి కథ గురించి అందరికీ తెలిసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గజ్జెల నగేష్, నివేదితతో కలిసి ఆయన మాట్లాడారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఇచ్చిన రూ.4వేల కోట్లు ఎక్కడ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నియోజకవర్గంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఆ బోర్డు మీటింగ్‌కు మల్కాజిగిరి ఎంపీ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి హాజరు కాలేదని దుయ్యబట్టారు. ఎస్ఆర్డీపీలో భాగంగా అభివృద్ధి జరిగిందన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు.
నటుడు సల్మాన్‌ఖాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారే తప్ప ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో 6వేల ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడిచ్చారు? అని ప్రశ్నించారు. వెయ్యి పడకల టీమ్స్ హాస్పిటల్‌ను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చారని స్పష్టం చేశారు. అందులో 85 శాతం పనులు పూర్తయ్యాయని, రేవంత్‌రెడ్డికి కనీసం రంగులు వేయడం కూడా చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. డిజిటల్ హెల్త్‌కార్డులపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు కేసీఆర్ భరోసా కల్పించారని పేర్కొన్నారు. గద్దర్ కుమార్తెకు టికెట్ ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఇన్‌చార్జ్జి నివేదిత అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ప్రజా పథకాలు నిలిపేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. సీఎంకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కంటోన్మెంట్లో సాయన్న ఎంతో అభివృద్ధి చేశారని, ఏ గల్లీలో చూసినా ఆయన వేసిన శిలాఫలకాలే కనిపిస్తాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌పై హస్తం పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు. మహిళలకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. కంటోన్మెంట్లో అభివృద్ధి మా త్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కదా? దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ నేత గజ్జెల నగేష్ ఫైర్ అయ్యారు. ఇక్కడి ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి వద్దకు రేవంత్‌రెడ్డి వెళ్లి కంటోన్మెంట్ సమస్య గురించి మాట్లాడారా? అని సూటిగా ప్రశ్నించారు. కనీసం రూ.25 వేలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ, రూ.4వేల కోట్లు కంటోన్మెంట్ అభివృద్ధికి ఎక్కడిచ్చారో? చెప్పాలని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డును ఎందుకు కలుపలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏమైందని విమర్శలు గుప్పించారు. బిల్లా రంగాల గురించి ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని, రేవంత్‌రెడ్డి మాత్రం బిల్లు రంగాగా మారాడని ఎద్దేవా చేశారు. ఇక్కడ బిల్లులు వసూలు చేసి, ఢిల్లీలో కడుతున్నారని దుయ్యబట్టారు.