సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది. గత నెల 31న శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా క్రిశాంక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
దీంతో క్రిశాంక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, తను రేవంత్‌రెడ్డి పరువుకు భంగం కలిగే విధంగా ఎలాంటి ట్వీట్ చేయలేదని, తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దానిని క్వాష్ చేయమని కోరుతూ క్రిశాంక్ హై కోర్టును ఆశ్రయించాడు. క్రిశాంక్ తరఫున న్యాయవాదులు రమణా రావు, జక్కుల లక్ష్మణ్ వాదనలు వినిపించారు. శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ సుజన.. క్రిశాంక్‌ను (41 (ఏ) సీఆర్పీసీ), 35(3) బీఎన్ఎస్ఎస్ ప్రకారం అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు.