మాదాపూర్, నవంబర్ 17: హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాదాపూర్ సియేట్ మారుతీ హిల్స్ కాలనీలో హైడ్రా అధికారులు కాంట్రాక్టర్లతో తవ్వకాలు చేపట్టి బాధితులను ఇబ్బందులకు గురిచేశారు. అడ్డుపడి మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తున్న స్థానికుడిపై వాగ్వాదానికి దిగి మొబైల్‌ను ధ్వంసం చేశారు. మాదాపూర్ సియేట్ మారుతీ హిల్స్ కాలనీ సున్నం చెరువు వద్ద గత మూడు రోజులుగా హైడ్రా అధికారులు వరుస తవ్వకాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు సున్నం చెరువులో ఎలాంటి తవ్వకాలు, ఫెన్సింగ్ పనులు, కూల్చివేతలు చేపట్టరాదని, అక్కడ ఎటువంటి నిర్వాహణ పనులు చేయరాదని ఈనెల 11న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి హైడ్రా అధికారులు మాత్రం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తు అక్కడ యథావిధిగా పనులు నిర్వహిస్తున్నట్లు బాధితులు తెలిపారు.
హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రోజు నుంచి హైడ్రా అధికారులు కాంట్రాక్టర్ సిబ్బందితో ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా అధికారుల తీరుతో మా పనులు మేము సరిగా చేసుకోలేకపోతున్నామని, కంటి నిండా నిద్ర కూడా పట్టడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాధితులు అందరూ మూకుమ్మడిగా కలిసి కోర్టు ఉత్తర్వులను చూపి దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పడంతో రెండు గంటల పాటు నివాసితులతో తీవ్ర వాదన చేసిన అనంతరం అధికారులు వెనుదిగినట్లు సమాచారం. తిరిగి ఈనెల16వ తేదీన రాత్రి సమయంలో హైడ్రా కాంట్రాక్టర్లు మళ్లీ వచ్చి బాధితులను బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా తమ ప్లాట్లలోకి ప్రవేశించి నిర్వాహణ పనులను చేస్తున్నారని, కాంట్రాక్టర్లు తమ ప్లాట్లలో చేస్తున్న పనులను రికార్డు చేసేందుకు ప్రయత్నించడంతో మొబైల్ ఫోన్ లాక్కొని పగులగొట్టినట్లు బాధితులు చెప్పారు. తిరిగి ఈనెల 17వ తేదీన ఉదయం నుంచే జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు.

హైడ్రా అధికారులు ఎప్పుడు పడితే అప్పుడు సున్నం చెరువులోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఇబ్బందులకు గురి చేయడంతో సురక్షితంగా ఉండలేకపోతున్నామని, క్షణ క్షణం భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద హై కోర్టు ఉత్తర్వులు, ఫోటోలు, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని నివాసితుల స్టేట్మెంట్లను తాము అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోయారు.
హైడ్రా అనధికారిక పనులతో భయభ్రాంతులకు గురైన స్థానికులతో కలిసి బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్‌కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసిన తరువాత రోజు నుంచి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తు హైడ్రా అధికారులు వరుసగా బాధితుల స్థలంలోకి చొరబడి తవ్వకాలు జరుపుతూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నం చేశారని, హైడ్రా కాంట్రాక్టర్ల నిర్వాహకాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీసేందుకు యత్నించిన వ్యక్తిపై దౌర్జన్యానికి దిగి ఫోన్ పగులగొట్టడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.