సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తేల్చే ఎన్నిక జూబ్లీహిల్స్‌లో జరగుతుందని అందులో మీ పార్టీ గెలిపించి చూపించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కి చురలకు అంటిస్తున్నారు. ఇటీవల బండి సంజయ్ ఓ మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, అవినీతి నాయకులను, రౌడీ షీటర్లను యోగీ పాలన తరహాలో అణిచివేస్తామని అన్నారు. ఆ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముందు జూబ్లీహిల్స్‌లో అభ్యర్థిని పెట్టండి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడం చూద్దామంటూ పోస్టులు పెడుతున్నారు. అభ్యర్థియే బీజేపీకి దొరకడం లేదని విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ తరహాలోనే అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాషాయం పార్టీ ఢీల్లీ వెళ్లిందని చర్చించారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఇంకా ఖరారు చేయలేదు. లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, పద్మల పేర్లతో సెంట్రల్ కమిటీకి పేర్లు పంపించిన విషయం తెలిసిందే. శనివారమే అభ్యర్థిని ఖరారు చేస్తారని అందరు భావించినా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో అభ్యర్థి పేరు ప్రకటించడంలో జరుగుతున్న ఆలస్యంపై క్యాడర్ గుర్రుగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పార్టీ ప్రచార కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీలో అభ్యర్థియే నిర్ణయించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థి కూడా బీజేపీకి దొరకడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.