ఆర్కేపురం : బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన మైనార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, యూత్ ఉపాధ్యక్షుడు హుస్సేనీ, బాదర్ ఆధ్వర్యంలో వివిధ కాలనీ, బస్తీలకు చెందిన కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS ) లో చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR ) అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మైనార్టీ ( Minorties ) లకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆమె అన్నారు. వందల కోట్ల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు ఇటీవల జల్పల్లి మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు రోడ్ల అభివృద్ధికి సీఎం ప్రత్యేక నిధులు సమకూర్చారని తెలిపారు .
బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీలో పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో ప్రతిపక్షాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సైయ్యద్ ఉబేద్, జుబేర్, సాజిద్ ఖాన్, సుజాహిత్ హుల్లాఖాన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.