‘ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిసి కూడా లక్షల్లో డబ్బులు తరలిస్తూ.. పట్టుబడుతున్నారు. ఎంత సీరియస్‌గా తరలించాలని ప్రయత్నించినా..ఆపరేషన్ ఎలా ఫెయిల్ అయింది.. మనం డబ్బులు తరలిస్తున్నట్టు వారికి సమాచారం ఎలా అందింది?’ ఇది గ్రేటర్‌లోని ఓ అభ్యర్థి ఆవేదన. ఈ ఆపరేషన్ ఫెయిల్ వెనక కోవర్టు అనే ప్రత్యర్థి రహస్య మిత్రుడు తమ శిబిరంలో ఉన్నాడనే విషయం వారికి బోధపడింది.
‘ కుల సంఘాలు, కాలనీ అసోసియేషన్లను కలిసి నాకు తోచినంత ఇచ్చి.. వారిని నా వైపునకు తిప్పుకున్నా. కానీ ఇదే సూత్రం నా ప్రత్యర్థి అమలు చేశాడు. వారంతా గిప్పుడు వారితో తిరుగుతున్నారు. మనోళ్లు మనోళ్లే గిట్ల చేస్తారనుకోలే. టికెట్ రాకపోయినా మీరంతా ఉన్నారన్న నమ్మకంతో రెబల్‌గా బరిలోకి దిగిన. శక్తికి మించి ఖర్చుపెడుతున్నా.. నా గెలుపు సూత్రాలన్నీ ప్రత్యర్థులకు తెలిసిపోతున్నాయి.’ ఇది ఓ రెబల్ అభ్యర్థి ఆవేదన.
సిటీబ్యూరో, నవంబర్ 17 ( నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. నువ్వా..నేనా అన్నట్టు అభ్యర్థులు ప్రచారంలో తలపడుతున్నారు. ఓ వైపు తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని బీఆర్ఎస్ గడపగడప ప్రచారంలో దూసుకుపోతుంటే..మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఎలాగైనా గెలవాలనే ఆకాంక్షతో ప్రజలను వదిలేసి కోవర్టులను నమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల్లో చురుకుగా ఉన్నవారిపై కన్నేస్తున్నాయి. వారిని ప్రలోభాలకు గురిచేసి సమాచారం అందించేందుకు నాయకులు ఒప్పిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల్లో కోవర్టులు చురుకుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొందరి అభ్యర్థుల వెంట అన్నా…అన్నా.. అంటూ పక్కన తిరుగుతున్నా.. అనుచరులే షాక్ ఇస్తున్నారు. ఇక్కడి సమాచారాన్ని అక్కడికి.. అక్కడి సమాచారాన్ని ఇక్కడికి మోస్తూ.. గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. చుట్టూ ఉండే వాళ్లలో కోవర్టులెవరో.. తమ వారెవరో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కోవర్టుల ప్రభావం గెలుపు అవకాశాలపై తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రత్యర్థి పార్టీలు కోవర్టుల కోసం లక్షలు వెచ్చిస్తున్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రత్యర్థి కదలికలపై దృష్టి సారిస్తున్నాయి. ప్రచారం ఎక్కడెక్కడ సాగుతుంది? ఎవరెవర్నీ కలుస్తున్నారు? తదితర సమాచారం సేకరించే పనిలో నిమగ్నమవుతున్నాయి. అందులో భాగంగా గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. కోవర్టులపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు ఎలాంటి ప్రణాళికలు వేయబోతున్నారో సమాచారం తెలుసుకుంటున్నారు. మరికొందరు అభ్యర్థులు ఏకంగా తమ అనుచరులనే ఇతర పార్టీల్లోకి పంపించి.. కండువా మార్చుకునేలా చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని తెలుసుకుంటున్నారు.Telangana Assembly Elections 2023, Telangana Assembly Elections
టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులను పార్టీపై కోపంతో వేరే పార్టీలోకి వెళ్లినా.. ఇన్నాళ్లు సొంత పార్టీలో ఉన్న నేతలతో ఉన్న సంబంధాలతో ప్రత్యర్థి వ్యూహాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాదు మరికొందరు ఆశావహులు పార్టీలోనే ఉంటూ అభ్యర్థి ఓడిపోయేలా తెర వెనక పావులు కదుపుతున్నారు. కుల సంఘాలు, కాలనీల ఓట్లు చీల్చడానికి ప్రత్యర్థులకు సలహాలిస్తూ సహకరిస్తున్నారు. కాగా, అభ్యర్థుల వెంట నిరంతరం ఉండే వారినే కోవర్టులుగా ఎంచుకుంటున్నారు. ఆ వ్యక్తులను రాత్రి సమయాల్లో రహస్యంగా సమావేశమై కావాల్సినంత ముట్టజెప్పి తమవైపు తిప్పుకుంటున్నారు. కోవర్టులు కూడా భారీ ప్యాకేజీ వస్తుండటంతో రహస్యంగా సేవలందించేందుకు సిద్ధమవుతున్నారు.