సిటీబ్యూరో, మే17, (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్: బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. బోరబండ, రహమత్ నగర్ డివిజన్లలోని 52 బస్తీల ప్రజలకు దాహార్తి తీరింది. 2021లో రూ.5.7 కోట్లతో రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో 3 మిలియన్ లీటర్ల వాటర్ రిజర్వాయర్ నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టింది. పనులన్నీ పూర్తయినా..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ను ప్రారంభించడకుండా వదిలేసింది. దీంతో బస్తీవాసులు పడుతున్న వెతలపై ‘నమస్తే’లో ‘బీఆర్ఎస్ నిర్మించింది.. కాంగ్రెస్ విస్మరించింది’ శీర్షికతో కథనం రాగా, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది.
ఈ మేరకు శనివారం రిజర్వాయర్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్చార్జి అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ ,జల మండలి ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రతి మూడు రోజులకు సరఫరా అవుతున్న నీటిని రోజు విడిచి రోజుకు మార్చడంతో 15,000 కుటుంబాలకు చెందిన 1,20,000 మందికి నీరందుతుంది. రహమత్ నగర్లో 25 బస్తీలు, బోరబండలో 31 బస్తీలకు అంతరాయం లేకుండా నీటి సరఫరా మెరుగుపడనుంది.
శనివారం ఎస్పీఆర్ రిజర్వాయర్ ప్రారంభం సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనే బదులు బంజారాహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ ప్రాంతాలకు నీరు అందిస్తున్నమని తెలిపారు. దీంతో అక్కడున్నవారంతా హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి అయి ఉండి నియోజకవర్గాల గురించి తెలియపోవడం విడ్డూరంగా ఉందంటూ మాట్లాడుకున్నారు.
బంజారాహిల్స్: ఎస్పీఆర్హిల్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. దాదాపుగా నిర్మాణం పూర్తి చేశామని, కాంగ్రెస్ సర్కారు వేసవి ముగింపునకు వస్తున్న సమయంలో రిజర్వాయర్ను ప్రారంభించడం హాస్యాస్పదమన్నారు. శనివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పేదలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయకుండా ఖైరతాబాద్ మండల కార్యాలయంలో పంపిణీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సిగ్గుచేటని, అధికారపార్టీ నేతల చేతుల్లోకి చెక్కులు వెళ్తున్నాయని, ఈ వ్యవహారాన్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు. మంత్రి తీరుకు నిరసనగా రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నామన్నారు. కమలానగర్లో మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానిక నేతలు, జిల్లా మంత్రి పైరవీలతో డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.