ఉస్మానియా యూనివర్సిటీ: గన్నుల దన్నుతో దండుపాళెంలా చొరబడి ఓయూ గడ్డపై గప్పాలు నరికిన సీఎం రేవంత్‌రెడ్డి, ఓయూలో అరచేతిలో వైకుంఠం కథ వల్లెవేసివెళ్లారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. ఓయూ చుట్టూ ఖాకీ కంచెలు పరిచి, రాత్రి పగలు గాలించిన విద్యార్థి నాయకులందరినీ నిర్బంధించి క్యాంపస్‌లోకి కాలకేయుడిలా రేవంత్‌రెడ్డి కాలుమోపారని ఎద్దేవా చేశారు.
సీఎం సోది పర్యటన సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థులందరిని తక్షణమే విడుదల డిమాండ్ చేశారు. హాస్టళ్లు, లైబ్రరీ, కళాశాలల చుట్టూ వేలాది మంది పోలీసులను మోహరించి, సీఎం రేవంత్ తన పైశాచికత్వాన్ని బయటపెట్టేసుకున్నారని దుయ్యబట్టారు. ఓయూ ఘన చరిత్ర గురించి రేవంత్ మాట్లాడుతుంటే జనరల్ డయ్యర్ మునిమనువడొచ్చి అమృత్సర్ అద్భుతాలు వర్ణించినట్లుందని ఎద్దేవా చేశారు.
చరిత్రలో వివిధ ఓయూ విద్యార్థి ఉద్యమాల ఊపిరి తీసి, వేలాదిమంది విద్యార్థుల నెత్తురు తాగిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. రెండేళ్లలో రాష్ట్ర విద్యారంగాన్ని గాలికొదిలేసి చివరికి గురుకులాల గొతు నులిమేందుకు యంగ్ ఇండియా స్కూళ్ల జపం చేస్తున్నారని అన్నారు. వందమందికి పైగా దళిత, గిరిజన, బడుగువర్గాల విద్యార్థులు గురుకులాల్లో దుర్మరణం చెందితే పట్టించుకున్న నాథుడేలేడని ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్లో విద్యారంగానికి 12 శాతం నిధులు కేటాయిస్తానని నమ్మించి ఐదు శాతం కూడా కేటాయించకుండా మోసం చేశారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ హయాంలో ఓయూ విద్యార్థి నాయకులను వివిధ పదవులతో గౌరవించగా, నేడు పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. డిసెంబర్లో పోలీసులు లేకుండా ఓయూకు వస్తే ఆయనకు అరగుండు తప్పదని హెచ్చరించారు.