Fathe Nagar | కవాడిగూడ, జూన్ 4 : జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018లో ప్రారంభించిన ఫతేనగర్ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ కారణంగా ప్రమాదాలకు గురవుతూ జనం చనిపోతున్నారని ఏడాదిన్నర కాలంగా విన్నవించుకున్నా జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ అసలు పట్టించుకోవడం లేదని, ఒక్కసారి కూడా ఫీల్డ్ విజిట్ చేయలేదని ఆరోపించారు. ఫ్లైఓవర్‌తో పాటు గతంలో ఆర్యుబి పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ ఆ పనులను ఇప్పటివరకూ చేపట్టకపోవడతో నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లైఓవర్ పనులతో పాటు ఆర్యుబి పనులను సైతం వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా లేవనెత్తుతామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు స్పస్టం చేశారు.