సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ హట్స్ (మడ్ఫోర్ట్ గుడిసెలు) ప్రాంతంలో దాదాపు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 15 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని బుల్డోజర్లతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు బెదిరించడం అత్యంత అమానుషమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం బుల్డోజర్ల బెదిరింపులపై భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలకు మద్దతుగా మన్నె క్రిశాంక్ వారి సమస్యలను విని, బీఆర్ఎస్ పేద ప్రజల పక్షాన అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల తరపున న్యాయపరమైన పోరాటం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టే ఆర్డర్ తీసుకురావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని క్రిశాంక్ తెలిపారు.
నాలుగు దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేయడం అన్యాయమని క్రిశాంక్ మండిపడ్డారు. ఇక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇళ్లను కూల్చివేయడం మానవత్వానికి విరుద్దమని పేర్కొన్నారు. గడిచిన రెండున్నరేండ్లలో ఒక్క ఇల్లు కట్టకపోగా..పేదల ఇండ్లను కూల్చడంలో మాత్రమే ఆసక్తి కనబర్చుతుందన్నారు. బోయిన్పల్లి-కంటోన్మెంట్ ప్రాంతంలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో 6వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని క్రిశాంక్ గుర్తు చేశారు. అయితే సుమారు రూ. 800 కోట్ల విలులైన ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని మరో ఖమ్మం లాగా మార్చే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని క్రిశాంక్ తెలిపారు.