ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న వేళ.. గ్రేటర్లో బీఆర్ఎస్ కారు గేరు మార్చింది. అందరి కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయడంతో.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. పదేండ్ల ప్రగతిని వివరిస్తూనే ప్రజల అవసరాలను తెలుసుకుంటున్నారు. ఓ వైపు సంక్షేమ ఫలాలను అందిస్తూ.. మరో వైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో పాటు పార్టీ క్యాడర్లో జోష్ పెంచేలా పాదయాత్రలతో ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. పార్టీ కార్యకర్తలు, కుల సంఘాలతో సమావేశమవుతూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. గులాబీ సైన్యం దూకుడు పెంచిన వేళ… ఇంకా అభ్యర్థిత్వమే ఖరారు కాక ప్రతిపక్షాలు గందరగోళంలో ఉన్నాయి.
వనస్థలిపురం, సెప్టెంబర్ 29: వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాగర్ రోడ్‌లోని జీఎస్ఆర్ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ మహిళా ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుతో రాజకీయాలు చేస్తోందన్నారు. ఇప్పుడు బిల్లు ఆమోదించి 2029లో అమలు చేస్తామనడం సరికాదన్నారు. గతంలో సీఎం కేసీఆర్ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో జీహెచ్ఎంసీలో 75మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారన్నారు. రిజర్వేషన్లలో భాగంగా ఎల్బీనగర్ మహిళలకు వస్తే సంతోషంగా మహిళా అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేసి గెలిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షీ టీమ్స్ ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయన్నారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్ర మహిళలంతా బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టి కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాలని సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మహిళలు కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అమలు కాని హామీలను చూసి మోసపోవద్దన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూడాలని కోరారు. మహిళలు తమ కాలనీల్లో అభివృద్ధిపై చర్చించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్ రెడ్డి, రమావత్ పద్మానాయక్, కొప్పుల విఠల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, చెరుకు సంగీత, సామ తిరుమల్‌రెడ్డి, సాగర్ రెడ్డి, జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, చింతల రవికుమార్, సత్యం చారి, సువర ్ణరెడ్డి, నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.