బడంగ్‌పేట/కందుకూరు/ఆర్కేపురం, డిసెంబర్ 3: మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అందెళ శ్రీరాములు యాదవ్‌పై పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి 26,158 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 5,47,577 ఓట్లు ఉండగా 3,02,762 ఓట్లు.. 55.39 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 1,25,549 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 99,391 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 70,616 ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి 26,158 ఓట్ల మెజార్టీ వచ్చిన్నట్లు ఎన్నికల అధికారి సూరజ్ కుమార్ ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి చేతుల మీదగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పత్రాన్ని అందుకున్నారు. మూడో రౌండ్, 11వ రౌండ్, 16వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అందెళ శ్రీరాములు సల్ప అధిక్యం కనబర్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చనగారి లక్ష్మారెడ్డి కౌంటింగ్ మొదలు అయిన్నప్పటి నుంచి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్స్‌లలో మెజార్టీ కొనసాగిస్తూ వచ్చారు. చివరకు 26,158 ఓట్ల మెజార్టీతో విజయ సాధించారు.
మహేశ్వరం నియోజకవర్గం ప్రజలే నా బలం బలగం అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి భారీ ఆధిక్యంతో గెలిపించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పటికి తనతోటి ఉంటాయన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని గెలిపించుకుంటామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ తెలిపారు. బాలాపూర్‌లో ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకునారు.