శేరిలింగంపల్లి, డిసెంబర్ 3: శేరిలింగంపల్లికి చెందిన ఓటరు దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు, ఎదరుగాలులు వచ్చిన తనను మూడుసార్లు ఆదరించి గెలిపించారు.
అభివృద్ధి, సంక్షేమంలో కలిసి నడుద్దామనే మంచి భావంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆశీర్వదిస్తున్నామని సుమారు 50 వేల మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. రెండు పర్యాయాలతో పాటు మూడోసారి తనకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో కన్న ఎక్కువ సేవలందిస్తా, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తానన్నారు. తనపై నమ్మకంతో శేరిలింగంపల్లికి మూడోసారి టికెట్ ఇచ్చి ఆదరించిన కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీ మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్న ంటాయి. నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. గులాబీ జెండాల రెపరెపలు…డీజే పాటలకు కార్యకర్తల నృత్యాలతో గచ్చిబౌలి స్టేడియం హోరెత్తింది. స్టేడియం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ సమూహంతో ర్యాలీగా బయలుదేరివెళ్లారు.