హైదరాబాద్ : ఏక్తా యూనిటీ మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు నినాదాలు చేశారు. కాగా, హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా(యూనిటీ) మాల్ టెండర్లలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.
యూనిటీ మాల్ టెండర్ల లో కావాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ, అనుమానాస్పద నిబంధనలతో ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేట్ డెవలపర్‌కు లబ్ధి చేకూరుస్తున్నదని ఆయన విమర్శించారు. తక్షణమే ఆ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టుపై తుది నిర్ణయాలు తీసుకోకముందే, ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధు ల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.